Leading News Portal in Telugu

Mr Tamilnadu Death: ‘మిస్టర్ తమిళనాడు’ మృతి.. బాత్​రూమ్​కు వెళ్లి..!


Mr Tamilnadu Death: ‘మిస్టర్ తమిళనాడు’ మృతి.. బాత్​రూమ్​కు వెళ్లి..!

Mr Tamilnadu Yogesh Dies with Heart Attack: ప్రముఖ బాడీ బిల్డర్, ‘మిస్టర్ తమిళనాడు’ టైటిల్ విన్నర్ యోగేష్ గుండెపోటుతో మృతి చెందారు. జిమ్​లో యువకులకు శిక్షణ అనంతరం బాత్​రూమ్​కు వెళ్లిన యోగేష్.. అక్కడే కుప్పకూలిపోయారు. యువకులు అతడిని స్థానిక​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. యోగేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. యోగేష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చే యోగేష్.. ఇలా చనిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మాగాంధీ వీధిలో యోగేష్ నివాసం ఉంటున్నారు. బాడీ బిల్డర్ అయిన అతడు కొన్ని ఏళ్లుగా వివిధ ఛాంపియన్‌షిప్‌లలో అనేక పతకాలు సాధించారు. ఈ క్రమంలో బాడీబిల్డింగ్‌లో ‘మిస్టర్ తమిళనాడు’ అవార్డు అందుకున్నారు. 2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న యోగేష్.. బాడీబిల్డింగ్​ పోటీలకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం అతను ఓ జిమ్​లో ట్రైనర్​గా పనిచేస్తున్నారు.

ఎప్పటిలానే ఈ రోజు జిమ్​కు వెళ్లిన యోగేష్.. శిక్షణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బాత్​రూమ్​కు వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన జిమ్​ యువకులు వెంటనే యోగేశ్‌ను స్థానిక కిల్పౌక్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్​కు విరామం ప్రకటించిన యోగేశ్​.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు చెప్పారు.