
Supreme Court: భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులనేవి చాలా వరకు తక్కువ. ప్రతీ 100 వివాహాల్లో ఒక్కరు మాత్రమే విడాకుల వరకు వెళ్తున్నారు. హింస, క్రూరత్వం వంటి కేసుల్లో ఇటు మహిళలు, అటు పురుషులు విడాకులను కోరుతున్నారు. కోర్టు అన్ని సాక్ష్యాలను పరిశీలించి నిజం అని తేలితేనే విడాకులను మంజూరు చేస్తోంది. దంపతులు కలిసి ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. చిన్న చిన్న వివాదాలకు విడిపోవడాన్ని కోర్టులు ప్రశ్నించడం గతంలో చూశాం.
తన భార్య నుంచి విడాకులు కావాలని కోరిన 89 ఏళ్ల వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాదాపుగా 27 పాటు కొనసాగిన ఈ కేసులో విడాకులను తిరస్కరించింది. వివాహాన్ని రద్దు చేస్తే భార్యకు అన్యాయం జరుగుతుందని కోర్టు తీర్పులో పేర్కొంది.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. నిర్మల్ సింగ్ పనేసర్(89), 1963లో వివాహం చేసుకున్నాడు. అయితే 1984లో దంపతుల బంధానికి బీటలు వారింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పనిచేస్తున్న నిర్మల్ సింగ్‌కి ఆ ఏడాది చెన్నైకి ట్రాన్స్‌పర్ అయింది. అయితే ఆయన భార్య పరంజిత్ కౌర్ పనేసర్(86)మాత్రం ఆయనతో పాటు అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది.
ఈ విషయంపై క్రూరత్వం కింద 1996లో భార్యతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కాడు. 2000లో జిల్లా కోర్లు విడాకులు మంజూరు చేసింది. అయితే భార్య పరంజిత్ కౌర్ పై న్యాయస్థానాల్లో తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసింది. ఈ కేసులు సుప్రీం ముందుకు రావడానికి మరో రెండు దశాబ్ధాలు పట్టింది. తాజాగా సుప్రీంకోర్టు వీరిద్దరికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది.
వివాహం అనేది భారతీయ సమాజంలో భార్యభర్తల మధ్య పవిత్రమైన, ఆధ్యాత్మిక, అమూల్యమైన భావోద్వేగ జీవిత వలయమని గురువారం తన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. విడాకులు తీసుకుందనే కళంకంతో తాను చనిపోవాలని కోరుకోవడం పరంజీత్ కౌర్ కోర్టుకు తెలిపింది, విడాకులు మంజూరు చేస్తే ఆమెకు అన్యాయం జరుగుతుందని తీర్పులో పేర్కొంది. తాను ఈ పవిత్రబంధాన్ని గౌరవించడానికి అన్ని ప్రయత్నాలు చేశానని, వృద్ధాప్యంలో తన భర్తను చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె కోర్టు చెప్పింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.