Leading News Portal in Telugu

Supreme Court: ఐన్‌స్టీన్ E = mc²ని సవాల్ చేస్తూ పిల్.. సుప్రీంకోర్టు రియాక్షన్ ఇదే..


Supreme Court: ఐన్‌స్టీన్ E = mc²ని సవాల్ చేస్తూ పిల్.. సుప్రీంకోర్టు రియాక్షన్ ఇదే..

Supreme Court: దశాబ్ధాల కింద ప్రకటించిన ఐన్‌స్టీన్, డార్విన్ సిద్ధాంతాలు ఇప్పటికి శాస్త్రరంగంలో కీలకంగా ఉన్నాయి. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం E = mc² ఇందులో ప్రధానమైనది. ఇప్పటికీ ఫిజిక్స్‌లో ఈ సిద్ధాంతం కీలకంగా ఉంది. మరోవైపు డార్విన్ మనిషి పరిణామ సిద్ధాంతం కూడా ఇదే కోవలోకి వస్తుంది.

ఇదిలా ఉంటే ఈ రెండు సిద్ధాంతాలను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులోని ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ని దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు ఈ పిల్ ని కొట్టేసింది. ఈ సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయని భావిస్తే మేం ఏం చేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ రాజ్ కుమార్, తాను ఈ సిద్ధాంతాలను తప్పుగా నిరూపించాలని అనుకుంటున్నానని, తన వాదనలను వినిపించేందుకు ఓ వేదిక కావాలని కోరాడు.

తాను స్కూల్, కాలేజీలో చదివిందంతా తప్పే అని పిటిషనర్ కోర్టుకు చెప్పాడు. ఈ సిద్దాంతంపై పనిచేయాలని కోర్టు అతనికి సూచించింది. ఆర్టికల్ 32 ప్రకారం పిటిషనర్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిందన్న అతని వాదనను కోర్టు ప్రశ్నించింది. ‘‘ నువ్వు ఈ సిద్ధాంతాన్ని ఇంప్రూవ్ చేసుకుంటావు, దీనికి సుప్రీంకోర్టు ఏం చేయాలి..? నువ్వు సైన్స్ స్టూడెంట్ అని చెబుతున్నావు, ఇప్పుడు ఆ థియరీ తప్పని అంటున్నావు.. ఈ థియరీ తప్పని నమ్మితే, అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఏమీ చేయాల్సిన పనిలేదు. ఆర్ఠికల్ 32 ప్రకారం మీ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడం ఏమిటి..? ’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మి చాలా మంది మరణించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు నీ సొంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించని కోరింది. చాలా కాలంగా ఉన్న రెండు సిద్ధాంతాలు తప్పు అని మీరు భావిస్తే, మీ సొంత సిద్ధాంతాన్ని ప్రచారం చేయండి అని జస్టిస్ కౌల్ అన్నారు.