Leading News Portal in Telugu

BSF Jawan Suicide: భార్య మరణవార్త విని బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య


BSF Jawan Suicide: భార్య మరణవార్త విని బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

BSF Jawan Suicide: భార్య మరణవార్త తెలియడంతో సరిహద్దు భద్రతా దళం(BSF) జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ బీఎస్‌ఎఫ్ జవాను ఫోన్‌లో తన భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో ఉన్న తన భార్య మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం కశ్మీర్‌లోని బీఎస్‌ఫ్ జవాన్‌కు తెలియడంతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. వీరికి ఎనిమిది నెలల క్రితం వివాహమైంది.

రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లాలోని ధీర్‌పూర్ గ్రామానికి చెందిన అన్షు యాదవ్ (24) మంగళవారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఆమె మృతి గురించి సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర యాదవ్ (28) తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వారు వెల్లడించారు.

పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లాలోని హర్సౌరా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రాజేష్ మీనా పేర్కొన్నారు. ఫోన్‌లో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు వెలుగులోకి వచ్చిందని, ఆ తర్వాత మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని మీనా తెలిపారు. రాజేంద్ర యాదవ్ మృతదేహాన్ని గురువారం జైపూర్ తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అన్షు యాదవ్, రాజేంద్ర యాదవ్ ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నారని రాజేష్ మీనా తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్) సెక్షన్ 176 కింద కేసు నమోదు చేసి దర్యాప్తును సబ్ డివిజనల్ అధికారికి అప్పగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.