Leading News Portal in Telugu

PFI: ఐదేళ్ల నిషేధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన పీఎఫ్ఐ


PFI: ఐదేళ్ల నిషేధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన పీఎఫ్ఐ

PFI: కేంద్ర ప్రభుత్వం తనపై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ట్రిబ్యునల్ ధృవీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పీఎఫ్ఐ తన పిటిషన్‌లో ఉపా(UAPA) ట్రిబ్యునల్ మార్చి 21 నాటి నిర్ణయాన్ని సవాలు చేసింది. దీనిలో సెప్టెంబర్ 27, 2022 నాటి కేంద్రం నిర్ణయాన్ని ధృవీకరించింది.

జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పీఎఫ్‌ఐ పిటిషన్‌ను విచారించాల్సి ఉండగా.. పిటిషనర్ వాయిదాకు లేఖ ఇచ్చారని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వంటి గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు, దేశంలో మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించినందుకు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఐని ఐదేళ్ల పాటు నిషేధించింది. కేంద్రం పీఎఫ్‌ఐ, దాని సహచరులు లేదా ఫ్రంట్‌లను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో ఏడు రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో పీఎఫ్‌ఐకి సంబంధించిన 150 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 16 ఏళ్ల ఈ సంస్థపై భద్రతా సంస్థలు చర్యలు తీసుకున్నాయి.

పీఎఫ్‌ఐ వ్యవస్థాపక సభ్యుల్లో కొందరు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) నాయకులుగా ఉన్నారని, జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)తో పీఎఫ్‌ఐకి సంబంధాలు ఉన్నాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) నోటిఫికేషన్ పేర్కొంది. JMB, SIMI రెండూ నిషేధిత సంస్థలు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) వంటి గ్లోబల్ టెర్రరిస్టు గ్రూపులతో పీఎఫ్‌ఐ అంతర్జాతీయ సంబంధాలకు అనేక ఉదాహరణలున్నాయని పేర్కొంది. దేశంలో అభద్రతా భావాన్ని పెంపొందించడం ద్వారా సమాజంలో తీవ్రవాదాన్ని పెంచేందుకు పీఎఫ్‌ఐ రహస్యంగా పనిచేస్తోందని, కొందరు పీఎఫ్‌ఐ కార్యకర్తలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్లో చేరడమే ఇందుకు నిదర్శనమని నోటిఫికేషన్ పేర్కొంది.