
India TV-CNX Opinion Poll: 5 రాష్ట్రాల ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరబోతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి రావచ్చని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీకి 125 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ కేవలం 72 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇక స్వతంత్రులు, ఇతర పార్టీల వారు కేవలం 3 సీట్లకే పరిమితమవుతారని తెలిపింది.
రాజస్థాన్ లో బీజేపీకి 44.92 ఓట్ షేర్ రాగా.. కాంగ్రెస్ పార్టీకి 40.08 శాతం ఓట్లు వస్తాయిని, ఇతరులకు 15 శాతం ఓట్ షేర్ వస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. 2018 ఎన్నికల్లో బీజేపీకి 38.77 శాతం, కాంగ్రెస్‌కు 39.3 శాతం, ‘ఇతరులకు’ 21.93 శాతం ఓట్లు వచ్చాయి. మార్వార్, మేవార్, టోంక్ కోటా, షేకావతి రీజియన్లలో కాంగ్రెస్ పై బీజేపీ స్పష్టమైన ఆధిత్యతను ప్రదర్శిస్తుందని వెల్లడించింది.
అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్ర ప్రజల్లో 32.5 శాతం మంది సీఎంగా అశోక్ గెహ్లాట్ ఉండాలని కోరుకుంటున్నారు. బీజేపీ పార్టీ కీలక నేత, మాజీ సీఎం వసుంధర రాజేకి 27 శాతం, సచిన్ పైలెట్ కి 12.35 శాతం, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ 10.07 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నారు. బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 7.81 శాతంతో ఐదో స్థానంలో ఉండగా, మరో బీజేపీ నేత దియా కుమారి 3 శాతంతో ఆరో స్థానంలో నిలిచారు.
42.18 శాతం మంది కాంగ్రెస్ పాలనతో పోలిస్తే గతంలోని బీజేపీ పాలనే నయంగా ఉందని అభిప్రాయపడ్డారు. 40.12 మంది కాంగ్రెస్ పాలన బాగుందని అన్నారు. 21.05 శాతం మంది ఓటర్లు నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని.. 18.51 శాతం మంది ద్రవ్యోల్భణం అతిపెద్ద సమస్యగా ఉందని అభిప్రాయపడ్డారు. 18.42 శాతం మంది శాంతిభద్రతలను సమస్యలను లేవనెత్తారు. 52.18 శాతం మంది బీజేపీ పథకాలు బాగున్నాయని చెప్పగా.. 40.27 శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 57.15 శాతం మంది అశోక్ గెహ్లాట్- సచిన్ పైలెట్ పోరు కాంగ్రెస్ ని దెబ్బతీయొచ్చని చెప్పారు. ఒబీసీల్లో 71 శాతం మంది కుల గణన చేపట్టాలని అన్నారు.