Leading News Portal in Telugu

Mahua Moitra: మహువా మోయిత్రా ఢిల్లీలో ఉంటే, దుబాయ్‌లో ఎలా లాగిన్ అయ్యారు..? బీజేపీ ఎంపీ మరో ఆరోపణ..


Mahua Moitra: మహువా మోయిత్రా ఢిల్లీలో ఉంటే, దుబాయ్‌లో ఎలా లాగిన్ అయ్యారు..? బీజేపీ ఎంపీ మరో ఆరోపణ..

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ‘ ప్రశ్నకు డబ్బు’ కేసులో చిక్కుకుపోయారు. వ్యాపారవేత్త నుంచి డబ్బులు, విలువైన గిఫ్టులను తీసుకుని పార్లమెంట్లో అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగారనే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి సదరు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లేఖ రాయడంతో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. లేఖలో ఎంపీ మహువామోయిత్రా తనతో చేయకూడని పనులు చేయించిందని ఆయన ఆరోపించారు.

దీంతో పాటు మహువా మోయిత్రా తన వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ ఐడీని ఇతరులకు అప్పగించిందని నిషికాంత్ దూబే ఆరోపించిన నేపథ్యంలో తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. మహుమా మోయిత్రా భారతదేశంలో ఉన్నప్పుడు దుబాయ్ నుంచి ఆమె పార్లమెంట్ ఐడీని ఉపయోగించారని, ఈ విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్ఐసీ), విచారణ సంస్థలకు అందించిందని నిషికాంత్ దూబే ఆమె పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా అన్నారు. ఇప్పటికీ ఈ వ్యవహారంపై టీఎంసీ, ఇతర ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని అనుకుంటున్నాయా.? ఇక దీనిపై నిర్ణయం ప్రజలదే అని నిషికాంత్ దూబే మహువా పేరు చెప్పకుండా పరోక్షంగా ఆరోపణలు చేశారు.

ఒక ఎంపీ దేశ భద్రతను డబ్బుల కోసం తాకట్టు పెట్టారు, ఎంపీ భారత్ లో ఉన్నప్పుడు దుబాయ్ నుంచి ఐడీ ఓపెన్ చేసింది. ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, కేంద్ర సంస్థలు సహా మొత్తం భారత ప్రభుత్వం ఈ ఎన్ఐసీని ఉపయోగిస్తుంది అని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాకు, కేంద్ర ఐటీ శాఖ మంత్రికి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లేఖలు రాశారు.