Garba events: నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గర్భా డ్యాన్స్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగాయి. గర్బా నృత్య వేడుకల్లో చిన్నా పెద్దా, యువతీ యువకులు పాల్గొంటున్నారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొంటున్న కొందరు గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. గర్బా వేడకలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. అప్పటి వరకు తమ ముందు ఆనందంగా, నవ్వుతూ డ్యాన్స్ చేసిన వ్యక్తులు గుండె పోటుతో మరణించడం చాలా మందిని కలిచివేస్తోంది.
గుజరాత్ లో గడిచిన 24 గంటల్లో గర్బా వేడుకల్లో పాల్గొంటూ 10 మంది మరణించారు. బాధితుల్లో టీనేజర్ల నుంచి మధ్యవయస్కుల వరకు ఉన్నారు. బరోడాలోని దభోయ్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా గుండె పోటుతో మరణించడం అందర్ని కలిచివేసింది. శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. అదేవిధంగా కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా గర్బా ఆడుతూ మృతి చెందాడు. రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
నవరాత్రులు మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే గుండె సంబంధిత సమస్యలతో 108 అత్యవస అంబులెన్స్ సేవల కోసం 521 కాల్స్ వచ్చాయి. శ్వాస సంబంధిత సమస్యల కోసం 609 కాల్స్ వచ్చాయి. గర్బా వేడుకలు జరిగే సాయంత్రం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ కాల్స్ వచ్చాయి. దీంతో ఈ సమస్యలపై ఇటు గర్బా ఈవెంట్లు నిర్వాహకులు, అటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గర్బా వేదికల సమీపంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అలర్టుగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గర్బా వేదికల వద్ద వైద్యులు, అంబులెన్స్ ఉంచుతున్నారు. సిబ్బందికి సీపీఆర్ చేసేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలకు ముందు గుజరాత్ రాష్ట్రంలో గర్భా సాధన చేస్తూ ముగ్గురు వ్యక్తుల గుండెపోటుతో మరణించారు.