Leading News Portal in Telugu

India’s aid to Gaza: గాజాకు భారత్ భారీ సాయం.. 6.5 టన్నుల వైద్య సామాగ్రి..


India’s aid to Gaza: గాజాకు భారత్ భారీ సాయం.. 6.5 టన్నుల వైద్య సామాగ్రి..

India’s aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు.

ప్రస్తుతం దక్షిణాన ఉన్న ఈజిప్టు నుంచి గాజాలోని రఫా క్రాసింగ్ వద్ద నుంచి గాజా ప్రజలకు మానవతా సాయం అందుతోంది. ఇదిలా ఉంటే యుద్ధంతో తల్లడిల్లిపోతున్న గాజా ప్రజలకు భారత్ కూడా ఆపన్నహస్తం అందించింది. పాలస్తీనా ప్రజల కోసం దాదాపుగా 6.5 టన్నుల వైద్యసాయాన్ని, 32 టన్నుల విపత్తు సహాయ సామాగ్రిని పాలస్తీనాకు పంపింది. ఈజిప్టు గుండా గాజాలోకి ఈ సాయం చేరుతుంది. ‘‘పాలస్తీనా ప్రజల కోసం దాదాపుగా 6.5 టన్నుల వైద్యసాయాన్ని, 32 టన్నుల విపత్తు సాయాన్ని తీసుకుని IAF C-17 విమానం ఈజిప్ట్‌లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందబ్ బాగ్చీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

మానవతా సాయం కింద ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువలుు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్స్, శానిటరీ వస్తువులు, నీటి శుద్దీకరణ వస్తువులు ఇందులో ఉన్నట్లు బాగ్చీ వెల్లడించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మూడు రోజుల తర్వాత పాలస్తీనాకు భారత్ సాయాన్ని అందించింది. పాలస్తీనాకు భారత్ మానవతా సాయాన్ని పంపుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై ఊచకోతకు పాల్పడ్డారు. ఈ దాడిలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ పై విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులను సర్వనాశనం చేస్తామని ప్రకటించిన ఇజ్రాయిల్, వారి స్థావరాలను టార్గెట్ చేస్తూ కీలక నేతలను మట్టుబెడుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలో 4000కు పైగా మరణించారు.