
Uttar Pradesh: విద్యార్థులు స్కూల్‌లో నమాజ్ చేయడం ఉత్తర్ ప్రదేశ్ లో వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, హిందూ సంఘాలు దీనికి అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. లక్నోలోని స్కూల్ లో నమాజ్ చేస్తున్న విద్యార్థుల వీడియో వైరల్ కావడంతో, ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. మరో ఇద్దరు ఉపాధ్యాయుల్ని హెచ్చరించి వదిలేసింది.
లక్నోలోని ఠాకూర్‌గంజ్ ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో కొందరు విద్యార్థులు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో రావడంతో ప్రిన్సిపాల్‌ని సస్పెండ్ చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం కొన్ని హిందూ సంఘాలు పాఠశాల నిర్వహణకు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఈ విషయంపై ప్రాథమిక శిక్ష అధికారి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. నేపియర్ రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో కొంతమంది చిన్నారులు శుక్రవారం నమాజ్ చేశారని ఉపాధ్యాయులు తెలిపారని, శాఖాపరమైన ఆదేశాలకు, మార్గదర్శకాలకు ఇది వ్యతిరేకమని, ఈ ఘటనను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దినేష్ కటియార్ విచారించారని ఆయన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ పాఠశాల నియమాలు-1999 ప్రకారం స్కూల్ ప్రిన్సిపాల్ మీరా యాదవ్ ని శనివారం సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. ఈ చర్యలకు సహకరించిన టీజర్లు తహజీన్ ఫాతిమా, మమతా మిశ్రాలను హెచ్చరించి వదిలేసినట్లు వెల్లడించారు.