
Young Man Suicide: కర్ణాటకలోని చిత్రదుర్గలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు తన తాతను కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని అడిగాడు. ఈ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్ కొనడానికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఘటన జరిగిన వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. అక్టోబర్ 8న ఈ జిల్లాలోని కోలాహల్ గ్రామంలో ‘మహాగణపతి శోభ యాత్ర’ సందర్భంగా యశ్వంత్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడని, ఆ తర్వాత కొత్త ఫోన్ కొనమని తాతను కోరాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్లి పంట వచ్చిన తర్వాత కొత్త సెల్ఫోన్ ఇప్పిస్తానని ఆ యువకుడికి తాత హామీ ఇచ్చాడు. అయితే అక్టోబరు 18న ఆ బాలుడు తనకు వెంటనే కొత్త మొబైల్ ఫోన్ కొనాలని డిమాండ్ చేశాడు. అయితే అందుకు తాత నిరాకరించడంతో విషం తాగాడు. ఘటన జరిగిన వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, తదుపరి చికిత్స కోసం దావణగెరె జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా గురువారం మృతి చెందినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కొన్నాళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో యశ్వంత్ తల్లి, తాతయ్యలతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. అతను వ్యవసాయంలో వారికి సహాయం చేసేవాడని అధికారి చెప్పారు.