Leading News Portal in Telugu

Honour Killing: దళిత యువకుడితో పారిపోయిందని కూతుర్ని నరికి చంపిన తండ్రి..


Honour Killing: దళిత యువకుడితో పారిపోయిందని కూతుర్ని నరికి చంపిన తండ్రి..

Honour Killing: కర్ణాటకలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడితో పారిపోయిందని ఓ తండ్రి కన్న కూతురిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటన నాగనాథపురలోని డాక్టర్స్ లే అవుట్‌లో అక్టోబర్ 21న జరిగింది. కూతురిని చంపిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. నిందితుడిని మైసూరులోని హెచ్‌డీ కోటేలోని కలిహుండి గణేశ(50)గా గుర్తించారు. కూతురిని చంపే క్రమంలో అడ్డుగా వచ్చినందుకు భార్య శారదతో పాటు భార్య సోదరి గీత, అతని భర్త శాంతకుమార్ ను కూడా గాయపరిచాడు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గౌడ సామాజిక వర్గానికి చెందిన కలిహుండి గణేష, శారద దంపతులకు పల్లవి అనే 17 ఏళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం పల్లవి హెచ్‌డీ కొటేలో పీయూ చదువుతోంది. అయితే పల్లవి షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. సదరు యువకుడు స్థానికంగా ఉండే ఓ దుకాణంలో పనిచేసేవాడు. వీరిద్దరు చదువుకునే రోజుల నుంచి మంచి స్నేహితులు. ప్రస్తుతం పల్లవి ఆమె తండ్రి ఆమెను గీత సంరక్షణలో ఉంచాడు. అక్టోబర్ 14న పల్లవి సదరు దళిత యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 20న పల్లవిని గీత ఇంటికి పంపించారు. అక్టోబర్ 21న గణేష్, గీత ఇంటి వెళ్లి పల్లవి, దళిత యువకుడితో పారిపోయి తన పరువు తీసిందని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తన భార్యతో కుమార్తెపై నిఘా పెట్టాలేదని గొడవపడ్డాడు. గొడవ తీవ్రం కావడంతో కొడవలితో పల్లవి మెడపై దాడి చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన భార్యతో పాటు ఆమె సోదరి, ఆమె భర్తను కూడా గాయపరిచాడు. తీవ్రగాయాల పాలైన పల్లవి మరణించింది. గాయపడిన వారిని విక్టోరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్య అనంతరం గణేష్ లొంగిపోయాడు.