
12 people died in accident in Karnataka’s Chikkaballapur: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన 44వ జాతీయ రహదారిపై చిక్కబళ్లాపుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం… దసరా పండగకు కూలీలు అందరూ గోరంట్ల మండలంలోని సొంత ఊళ్లకు వెళ్లారు. ఉపాధి కోసం తిరిగి బెంగళూరులోని హొంగసంద్ర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున పొగమంచు బాగా ఉండటంతో టాటా సుమో డ్రైవర్ నరసింహులు రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొట్టాడు. దీంతో టాటా సుమోలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు చిక్‌బళ్లాపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.