
Tiger claw row: ‘పులిగోరు’ వివాదం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రాజ్యసభ ఎంపీ, నటుడు జగ్గేష్ టీవీ లైవ్ షో ఇంటర్వ్యూలో పులి-గోరు లాకెట్ ధరించి కనిపించడంతో అతని ఇంట్లో అటవీ శాఖ సోదాలు చేసింది. అంతకుముందు కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఇలాంటి లాకెట్ ధరించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ఇంట్లో కూడా అటవీ శాఖ సోదాలు నిర్వహించింది.
ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై కర్ణాటక బీజేపీ నేత అరవింద్ బెల్లాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదులు, దర్గాల్లో నెమలి ఈకలు వినియోగిస్తున్నారని, వాటిపై కూడా అటవీ శాఖ దాడులు చేయాలని విరుచుకుపడ్డారు. మసీదుల్లో నెమలి ఈకల వినియోగంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్య వెళ్లీ ఆ నెమలి ఈకల నుంచి ఆశీర్వాదం తీసుకోవడం చూడలేదా..? నెమలి మన జాతీయ పక్షి, ఇది నేరం,చట్ట విరుద్ధం అంటూ బెల్లాడ్ వ్యాఖ్యానించారు.
పులిపంజా లాకెట్ కలిగి ఉన్నందుకు కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్ ని షో సెట్స్ నుంచే అరెస్ట్ చేయడంవతో పులి గోరు వివాదం చెలరేగింది. నిజానికి పులిగోరు కలిగి ఉండటం చట్ట విరుద్ధం, అమ్మకం, కొనుగోలు నేరం. అటవీ శాఖ అధికారులు అక్టోబర్ 22న షో సెట్స్ కి చేరుకుని పులి గోరు ఉన్న లాకెట్ ని పరిశీలించారు. ఇది నిజమైనదని తేలడంతో వర్తూర్ సంతోష్ ని అరెస్ట్ చేశారు.
వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం, పులులు, సింహాలు, జింకలు వంటి వన్యప్రాణులను చంపడం మరియు వాటి గోళ్లు, చర్మాలు, కొమ్ములు మొదలైన వాటిని కలిగి ఉండటం లేదా విక్రయించడం నేరంగా పరిగణించబడుతుంది.