
Qatar: ఖతార్‌లోని అక్కడి కోర్టు 8 మంది మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులకు కావాల్సిన న్యాయసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కోర్టు తీర్పు గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
అయితే వీరంతా ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రాయిటర్స్ తెలిపింది. ఆగస్ట్ 2022లో ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 8 మందిని అరెస్ట్ చేసింది. చాలా సార్లు వీరంతా బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పటికీ, వాటిని తిరస్కరించింది. తాజా కోర్టు వీరికి మరణశిక్షను విధించింది. అయితే గూఢచర్యం విషయాన్ని ఖతార్ కానీ, భారత్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది భారతీయులు తమ శిక్షలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని ఖతార్ లోని కేసు గురించి తెలిసిన సోర్సెస్ వెల్లడించాయి.
అయితే ఇజ్రాయిల్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరి గురించి ఇజ్రాయిల్ ప్రభుత్వం ఏం స్పందించలేదు. ఖతార్ లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వీరికి మరణ శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా మరియు సెయిలర్ రాగేష్‌లు ఉన్నారు. వీరంతా ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ అయిన దహ్ర గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు.