
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో భార్యభర్తల గొడవ కొడుకును నేరస్తుడిగా మార్చింది. తన తల్లిని బలవంతంగా ఇంటి నుంచి వెళ్లగొట్టాడనే కోపంతో తండ్రిని హత్య చేశాడు ఓ బాలుడు. ఈ ఘటన జార్ఖండ్ లోని పాలము జిల్లాలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీస్ అధికారులు శుక్రవారం తెలిపారు.
పక్రియా గ్రామానికి చెందిన చోటూ శర్మ(42)ని అతని కొడుకు బుధవారం కత్తితో పొడిచి చంపాడు. నేరం చేసిన తర్వాత బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు చోటూ శర్మ, ఇంట్లో గొడవల కారణంగా భార్యను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని నవజయ్పూర్ పోలీస్ స్టేషన్ అధికారి సంజయ్ కుమార్ రజక్ తెలిపారు. తల్లిని వెళ్లగొట్టిన మనస్తాపంలో బాలుడు తండ్రిని హత్య చేశాడు. నిందితుడి తల్లి జిల్లాలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిందని, చోటూ శర్మ బంధువు ఒకరు అతడిని కొడుకు చంపడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు.