
Kerala Bomb Blast: కేరళలో వరస పేలుళ్ల తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో హై అలర్ట్‌లో ఉన్నాయి. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండగ సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచుల నిర్వహణ నేపథ్యంలో ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ముంబైలో యూదులు ఎక్కువగా ఉండే చాబాద్ హౌజ్ వద్ద ఇప్పటికే భద్రతను పెంచారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిఘా సంస్థలతో నిరంతరం టచ్ లో ఉందని, రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం ఉదయం కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో యెహోవా విట్‌నెస్ ప్రార్థనా సమావేశం జరుగుతున్న సమయంలో వరసగా మూడు సార్లు పేలుళ్లు సంభవించాయి. టిఫిన్ బాక్సుల్లో ఐఈడీ పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్లు నిఘా వర్గాలు తేల్చాయి. ఈ పేలుళ్లలో ఒకరు మరణించగా.. 40 మంది వరకు గాయపడ్డారు. కొచ్చికి 10 కిలోమీటర్ల దూరంలో కలమస్సేరిలో జరిగిన ఈ సమావేశానికి దాదాపు 2,000 మంది హాజరయ్యారు. అక్టోబర్ 27న ప్రారంభమైన మూడు రోజుల ప్రార్థన సమావేశానికి ఈరోజు చివరి రోజు.
ప్రస్తుతం ఈ పేలుళ్లపై విస్తృత దర్యాప్తు జరుగుతోంది. ఈ పేలుళ్లకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. దీంతో పాటు కేంద్రం నుంచి ఎన్ఎస్జీ బలగాలు కూడా కేరళకు చేరుకున్నాయి. దీనికి తోడు కేరళ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితి గురించి సీఎం పినరయి విజయన్ కి హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు.