Leading News Portal in Telugu

Apple: ‘హ్యాకింగ్’పై ఆపిల్‌కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..?



Apple

Apple: ఇటీవల ప్రతిపక్ష నేతలకు ఆపిల్ ఐఫోన్లు హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందని అలర్ట్ మేసేజ్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రతిపక్ష నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లకు నోటిఫికేషన్లు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ ప్యానెల్ ఆపిల్ ఇండియా అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.

‘స్టేట్ స్పాన్సర్డ్’ దాడులకు గురికావచ్చని ఇటీవల విపక్ష నేతల ఐఫోన్లకు నోటిఫికేషన్లు వచ్చాయి. దీనిపై ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే ఐఫోన్ హ్యాకింగ్ పై ప్రతిపక్షాల ఆందోళనల్ని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిన్న తోసిపుచ్చారు. ఎన్నికల సీజన్ అంటూ దీన్ని కొట్టిపారేశారు.

Read Also: Minister Srinivas Goud: రాహూల్ గాంధీ పది సార్లు పర్యటించినా.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు..!

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నేతలు పవన్ ఖేరా, శశిథరూర్, కేసీ వేణుగోపాల్, సుప్రీయా శ్రీనాథ్, టీఎస్ సింఘ్‌దేవ్, భూపిందర్ సింగ్ లతో పాటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ల మొబైల్ ఫోన్లకు నోటిఫికేషన్లు వచ్చాయి.

ఆపిల్ దాదాపు 150 దేశాల్లోని పలువురికి ఈ అలర్ట్ జారీ చేసింది. అయితే ప్రభుత్వంపై విపక్షాల దాడిని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తిప్పికొట్టారు. ప్రధాని నాయకత్వంలో దేశపురోగతిని తట్టుకోలేకే కొంత మంది ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నోటిఫికేషన్లపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని తెలిపారు.