
Road Accidents: ఇండియాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం, చాలా సందర్భాల్లో రోడ్ల పరిస్థితులు సరిగా లేకపోవడం, ఓవర్ స్పీడ్, వాహనదారుల అజాగ్రత్త ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా రోడ్లను పట్టించుకోకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. తాజాగా రోడ్డు రవాణా మంత్రి శాఖ వెల్లడించిన నివేదికలో ఇండియా వ్యాప్తంగా 2022లో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు తేలింది.
ఇండియాలో 2022లో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 9.4 శాతం ఉండగా.. గాయాలపాలైన వారి 15.3 శాతం ఉన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు 11.9 శాతం పెరిగాయి. ఈ వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఇటీవల వెల్లడించింది.
రోడ్డు ప్రమాద మరణాల్లో ఢిల్లీ తొలిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో బెంగళూర్, మూడో స్థానంలో జైపూర్ ఉన్నాయి. నాలుగో స్థానంలో కాన్పూర్ ఉండగా.. హైదరాబాద్ 23వ స్థానంలో ఉంది. ఇక నేషనల్ హైవేలపై మరణాలు ఎక్కువగా తమిళనాడులో చోటు చేసుకున్నాయి. బెంగళూర్ లోని ఇరుకైన రహదారులపై 2022లో 3822 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. 772 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఏడాది అంటే 2021లో 651 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. 3182 మంది గాయపడ్డారు.
ఢిల్లీలో 2021లో 4720 ప్రమాదాలు జరిగాయి. 2022లో 5652 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో 1461 మంది మరణించాగా.. 5201 మంది గాయపడ్డారు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే 2021లో 2273 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2022లో ఈ సంఖ్య పెరిగి 2516కి చేరింది. ఇందులో 323 మంది మరణించగా.. 2252 మంది గాయపడ్డారు.
చెన్నైలో 2021తో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణాలు గణనీయంగా 49 శాతం తగ్గాయి. 2021లో 998 మంది మరణిస్తే.. 2022లో 507 మంది ప్రమాదాల్లో చనిపోయారు. తమిళనాడులో 2022లో జాతీయ రహదారులపై అత్యధికంగా 64,105 కేసులతో రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.
భారతదేశం అంతటా, 2022లో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి, ఫలితంగా 1,68,491 మరణాలు మరియు 4,43,366 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని నివేదిక సూచించింది మరియు మద్యం తాగి వాహనాలు నడపడం మరియు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం కూడా దీనికి కారణమని పేర్కొంది.