Leading News Portal in Telugu

Madhya Pradesh: నాకు పెళ్లి చేస్తేనే, ఎలక్షన్ డ్యూటీకి వస్తా..


Madhya Pradesh: నాకు పెళ్లి చేస్తేనే, ఎలక్షన్ డ్యూటీకి వస్తా..

Madhya Pradesh: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎలక్షన్ డ్యూటీ పడుతోంది. అయితే ఇప్పుడు ఓ టీచర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరుకాకపోవడమే కాకుండా, షోకాజ్ నోటీసులు పంపిన అధికారులకు ఖంగుతినే సమాధానం వచ్చింది. ఈ సమాధానం చూసి ఉన్నతాధికారులకు చిర్రెత్తుకొచ్చి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. అఖిలేష్ కుమార్ మిశ్రా అనే ఉపాధ్యాయుడికి 35 ఏళ్లు. సాత్నాలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల డ్యూటీ కోసం ఆయనతో పాటు మిగతా ఉపాధ్యాయులకు కూడా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 16,17 తేదీల్లో శిక్షణా తరగతులకు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనికి అఖిలేష్ కుమార్ హాజరు కాలేదు. దీనిపై ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

అయితే, దీనికి సమాధానంగా అఖిలేష్ కుమార్.. ‘‘ ఇప్పటికే నాకు 35 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంకా పెళ్లి కాలేదు. బ్యాచిలర్‌గా ఉండలేకపోతున్నా. జీవితాంతం భార్య లేకుండా ఉండిపోవాల్సి వస్తుందేమో అని భయమేస్తుంది. ముందు నాకు పెళ్లి చేయండి. ఆ తర్వాత ఎన్నికల విధులకు వస్తాను’’ అని అక్టోబర్ 31న రిఫ్లై ఇచ్చారు. అసలే పెళ్లి కావడం లేదని చెబుతూనే.. తనకు రూ. 3 లక్షల కట్నంతో పాటు తాను ఉంటున్న ప్రాంతంలో ఓ ప్లాట్ ఇవ్వాలని కోరడం కొసమెరుపు.

ఈ సమాధానంపై కలెక్టర్ అతడిని నవంబర్ 2న సస్పెండ్ చేశారు. అయితే మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడం వల్ల అతను సస్పెండ్ అయిన విషయం తెలియలేదు. తోటి ఉద్యోగి చెప్పడంతో తాను సస్పెండ్ అయినట్లు అఖిలేష్ కుమార్ విషయాన్ని తెలుసుకున్నారు. పెళ్లికాకపోవడంతో ఒత్తిడిలో ఉన్నాడని, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కలెక్టర్ స్థాయి అధికారి ఎవరైనా వివరణ కోరితే ఇలాంటి సమాధానం చెబుతారా..? గతేడాదిగా అతను మొబైల్ ఫోన్ వాడటం లేదని సదరు ఉద్యోగి చెప్పారు.