
Heart Attack: ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల క్రితం కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే గుండెపోటు వస్తుందని అంతా అనుకునే వాళ్లం. కానీ ఇప్పడు స్కూల్ పిల్లల నుంచి టీనేజ్ వయసు వారికి, 30 ఏళ్ల లోపువారు కూడా గుండె పోటుకు గురై ప్రాణాలు వదులుతున్నారు. అంతవరకు సంతోషంగా పెళ్లిలోనో, ఇతర శుభకార్యాల్లో నవ్వుతూ డ్యాన్సులు చేస్తున్న వారు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ కారణంగా విగతజీవులవుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్ రాష్ట్రంలో 9వ తరగతి బాలిక గుండె పోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థినికి గుండెపోటు రావడమేంటని అంతా షాక్ అవుతున్నారు. రాష్ట్రంలోని అమ్రేలి నగరంలో 9 తరగతి చదువుతున్న బాలిక, పరీక్షా హాలులోకి వెళ్లే కొన్ని క్షణాల ముందు స్పృహతప్పి కుప్పకూలింది. మరణించిన విద్యార్థినిని రాజ్‌కోట్ జిల్లా జస్తాన్ తాలూకాకు చెందిన సాక్ష్ రాజోసరగా గుర్తించారు. సంతబ గజేరా పాఠశాలతో చదువుతున్న బాలిక నిన్న ఉదయం పరీక్షా హాలులోకి ప్రవేశిస్తుండగా పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు గుర్తించారు.
కోవిడ్-19 తర్వాత యువతలో గుండెపోటు రావడం ఎక్కువైంది. ఇటీవల కేంద్రం ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా కరోనా వైరస్-గుండెపోటు లింకులపై ప్రస్తావించారు. తీవ్రమైన కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, ఎక్కువగా కష్టపడకూడదని ఆయన చెప్పడం గమనార్హం.