Leading News Portal in Telugu

Arvind Kejriwal: బీజేపీ, కాంగ్రెస్‌లు ఆప్ కన్నా చిన్నవి.. మమ్మల్ని చూసి భయపడుతున్నారు..


Arvind Kejriwal: బీజేపీ, కాంగ్రెస్‌లు ఆప్ కన్నా చిన్నవి.. మమ్మల్ని చూసి భయపడుతున్నారు..

Arvind Kejriwal: వచ్చే ఏడాది హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చినట్లే హర్యానాలో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పర్యటించారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్, బీజేపీలు ఆప్ కంటే చిన్న సంస్థలని నేను చెప్పగలనని, ఆమ్ ఆద్మీ పార్టీ సైజులో 10వ వంతు కూడా లేరని, ప్రజలు ఆశలు పెట్టుకున్న సమయంలో ఆప్ ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ లేదా బీజేపీ ఏ గ్రామానికి వెళ్లి తమ పార్టీలో చేరాలని ప్రజల్ని కోరినా.. ఒక్కరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదని కేజ్రీవాల్ అన్నారు. కానీ ఒక ఆప్ కార్యకర్త ఒక గ్రామానికి వెళ్లి తమతో చేరాలని అడిగితే, ప్రతీ ఇంటి నుంచి పిల్లలు కూడా తమ పార్టీలో చేరాలనుకుంటారని, ఎందుకంటే ప్రజలు ఆప్‌పై ఆశలు పెట్టుకున్నారని వెల్లడించారు.

కేవలం 11 ఏళ్లలోనే బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడిందని, ఆప్ ఎదుగుదల చూసి బీజేపీ, ప్రధాని మోడీ భయపడుతున్నారని అన్నారు. ఆప్ వేగానికి ఢిల్లీ, పంజాబ్ లాగానే ఇతర రాష్ట్రాలు కూడా ఆ పార్టీ నుంచి దూరమవుతాయని భయపడుతున్నారని ఢిల్లీ సీఎం అన్నారు. ఈడీ దాడులపై మాట్లాడుతూ.. మీరు ఏ నేరమైనా చేయవచ్చు, రక్షణ పొందడానికి బీజేపీలో చేరవచ్చని ఎద్దేవా చేశారు. ఈడీకి పట్టుబడి జైలుకెళ్లిన వాడు అవినీతిపరుడు కాదని, ఈడీకి భయపడి బీజేపీలో చేరిన వాడు అసలైన అవినీతిపరుడని వ్యాఖ్యానించారు.