Leading News Portal in Telugu

Bus Accident: బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు.. నలుగురు మృతి!


Bus Accident: బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు.. నలుగురు మృతి!

4 dead and several injured in Rajasthan Bus Accident: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పిన ఓ బస్సు.. బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్‌ (రైలు పట్టాలు)పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ రాజ్‌కుమార్ కస్వా పేర్కొన్నారు.

వివరాల ప్రకారం… హరిద్వార్ నుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్తోన్న బస్సు దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పి వంతెన పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం అనంతరం అధికారులు 28 మందిని ఆసుపత్రికి తరలించగా.. అందులో 4 మంది అప్పటికే మరణించారు. వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు దౌసా జిల్లా మేజిస్ట్రేట్ కుమ్మర్ చౌదరి తెలిపారు.