
Bangalore: కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని తన నివాసంలో దారుణంగా కత్తిపోట్లకు గురై, చనిపోయారు. అయితే ఈ హత్య కేసులో పోలీసులు కిరణ్ అనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు కొంతకాలంగా.. కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే అతన్ని కొన్ని రోజుల కిందట ప్రతిమ సర్వీసు నుంచి తొలగించింది. అయితే అప్పటినుంచి ఆమెపై కోపం పెంచుకుని.. ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు.. అతని ఆచూకీ కోసం వెతకగా, చామ్రాజ్నగర్ జిల్లాలో అరెస్టు చేశారు. ఈ కేసుపై.. బెంగళూరు పోలీస్ కమీషనర్ బి దయానంద్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిమ హత్య కేసుకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాం. నిందితుడిని మలే మహదేశ్వర కొండల సమీపంలో అరెస్టు చేశాం. నిందితుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 7-10 రోజుల ముందు ప్రతిమ అతడిని ఉద్యోగం నుంచి తొలగించి ఉంటారు ’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే నిందితుడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.