
Hijab: కర్ణాటక ఎగ్జామ్ అథారిటీ(కేఈఏ) తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ విమర్శలకు దారి తీసింది. రిక్రూట్మెంట్ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎలాంటి డ్రెస్ కోడ్‌లో హాజరుకావాలో తెలియజేసే మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేసింది. అయితే ఇందులో తలను, చెవులను కప్పిఉంచే వస్త్రాలను, టోపీలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్షల్లో కాపీయింగ్, బ్లూటూత్ డివైసెస్ వాడకుండా పకడ్బందీ చర్యల్లో ఈ నియమావళిని తీసుకువచ్చినట్లు చెప్పింది.
మరోవైపు హిందూ వివాహిత మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు, మెట్టెలు, ఉంగరాలకు అనుమతించింది. హిందూ సంఘాల నుంచి నిరసనలు రావడంతో వీటికి అనుమతిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో గతేడాది నుంచి హిజాబ్ అంశంపై పెద్ద వివాదమే నడిచింది. అయితే ఎగ్జామ్ ప్యానెల్ చెప్పిన మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా హిజాబ్ గురించి ప్రస్తావించున్నా.. తలపై నుంచి కప్పే దుస్తులు అంటే హిజాబ్ కూడా వస్తుందని అంతా భావిస్తున్నారు.
Read Also: Arvind Kejriwal: మోడీపై సోషల్ మీడియా పోస్టులు.. ప్రియాంకాగాంధీ, కేజ్రీవాల్‌కి ఈసీ షోకాజ్ నోటీసులు..
ఈ తరుణంలో తాజాగా డ్రెస్ కోడ్ పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలతో పాటు ఇతర రాజకీయ నాయకులు విమర్శలు లేవనెత్తారు. దీంతో కర్ణాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కొన్ని గంటల తర్వాత హిజాబ్ అంశంపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ క్లారిటీ ఇచ్చారు. హిజాబ్‌పై ఎలాంటి నిషేధం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో మైనారిటీ మహిళా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హిజాబ్ తో హాజరవు కావచ్చని స్పష్టం చేసినట్లు అయింది.
రాజకీయ నేతల విమర్శల నేపత్యంలో మంత్రి సుధాకర్ మాట్లాడుతూ.. తప్పుడు సమాచారం ఎందుకు ప్రచారం చేస్తారో తెలియడం లేదు.. నాకు ఇందులో ఏం తప్పు అనిపించడం లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18,19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లకు పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కేఈఏ డ్రెస్ కోడ్‌కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.