
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. పీఓకే, భారత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద చొరబాటు యత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. ఈ ఏడాది చొరబాట్లు గణనీయంగా తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 26న కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఇలాగే చొరబాటుకు యత్నించారు. వీరిని సైన్యం మట్టుపెట్టింది. అక్టోబర్ 22న బారాముల్లా జిల్లాలో ఉరీ సెక్టార్లో కూడా ఇద్దరు చొరబాటుదారులో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. జూన్ నెలలో మొత్తం 11 మంది చొరబాటుదారుల్ని కాల్చి చంపారు. ఇందులో మచిల్ సెక్టార్ లో నలుగురు, కేరాన్ సెక్టార్ లో ఐదుగురిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
Read Also: Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ.. థాయ్‌లాండ్ గుహ నుంచి పిల్లల్ని రక్షించిన సంస్థకు పిలుపు..
పీఓకే ప్రాంతంలో ఉగ్రవాద తండాల్లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్ లోకి పంపేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అక్కడి ఉగ్రవాద శిబిరాలను లాంచింగ్ ప్యాడ్స్‌గా ఉపయోగించుకుంటోంది. అయితే సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీసులు ఎప్పటికప్పుడు ఈ చొరబాట్లను అడ్డుకుంటున్నారు. ఇటీవల కాలంలో జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో స్థానిక ఉగ్రవాదులు తగ్గిపోయారు. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయి. అయితే మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు.