
Jaya Prada: సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకు ఉత్తర్ ప్రదేశ్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు మాజీ ఎంపీ జయప్రదపై యూపీ జిల్లాలోని కోర్టు శుక్రవారం నాన్-బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది.
జయప్రద కోర్టుకు హాజరుకానందున ఆమెపై జారీ చేసిన వారెంట్ అమలులో ఉంటుందని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శోభిత్ బన్సల్ తెలిపారని ప్రాసిక్యూటర్ అధికారి నీజర్ కుమార్ తెలిపారు. కోర్టు వారెంట్‌ను కొనసాగించడం ఇది నాలుగో సారి. తదుపరి విచారణ నవంబర్ 24న ఉండనుంది. పోలీసులు జయప్రదను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచవచ్చని నీరజ్ కుమార్ అన్నారు.
2019 ఎన్నికల ప్రచారంలో జయప్రదపై స్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇది రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్ లో ఉంది. జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక రహదారిని ప్రారంభించినందుకు ఆమెపై కేసు నమోదైంది.