Leading News Portal in Telugu

Maldives: భారత్ మిలిటరీ మా దేశం నుంచి విత్‌డ్రా చేసుకోవాలి..



Maldives

Maldives: మాల్దీవులు అన్నంత పనిచేసింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత.. మాల్దీవుల్లో భారత మిలిటరీ ఉనికి ఉపసంహరించుకోవాలని కోరింది. అంతకుముందు రోజు ప్రయాణ స్వీకారానికి భారత్ తరుపున మాల్దీవులు వెళ్లిన కేంద్రమంత్రి కిరెన్ రిజిజును కలిసినప్పుడు, ముయిజ్జూ అధికారికంగా ఈ అభ్యర్థన చేసినట్లు తెలిసింది.

మాల్దీవుల నుంచి భారత్ మిలిటరీని వెళ్లగొడతామని, ఎన్నికల ముందు ముయిజ్జూ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాన హామీల్లో ఒకటైన దీన్ని వెంటనే అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రమాణస్వీకారానికి ముందు కొన్ని సందర్భాల్లో ఇదే విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అయితే భారత మిలిటరీ స్థానాన్ని, చైనా కానీ ఇతర దేశాల మిలిటరీలతో భర్తీ చేయమని హమీ ఇచ్చారు. తాము భారత్, చైనాతో పాటు అన్ని దేశాలతో సంబంధాలను కోరుకుంటున్నామని, మాది చిన్న దేశమని ఎవరితో విద్వేషం పెంచుకోమని ఓ ఇంటర్వ్యూలో ముయిజ్జూ చెప్పారు.

Read Also: Asaduddin Owaisi: “రాహుల్ గాంధీ అద్దంలో చూసుకో”.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

భారతదేశం పేరును ప్రస్తావించకుండా.. మాల్దీవుత్లో విదేశీ సైనిక సిబ్బంది ఉండదని, మా భద్రత విషయానికి వస్తే నేను రెడ్ లైన్ గీశాను, మాల్దీవులు కూడా ఇతర దేశాల పరిధిని గౌరవిస్తుందని చెప్పినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న మాల్దీవులు ఇండియాకు చాలా కీలకం. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ఆధిక్యతను అడ్డుకోవాలంటే మాల్దీవులు చాలా అవసరం. అయితే గత మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలేహ్ భారత్‌కి సన్నిహితంగా ఉండే వారు. అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు చైనాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెబుతున్నారు.