
PM Modi: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 25న జరగబోతున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేస్తున్నాయి. ఈ సారి అధికారమే ధ్యేయంగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి చేసిందని, తాము అధికారంలోకి వస్తే అన్నీ బయటకు తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం రోజు ప్రధాని నరేంద్రమోడీ ఆ రాష్ట్రంలోని భిల్వారాలోని షాపూరాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలెట్‌పై కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుందని, కాంగ్రెస్ చరిత్ర మీకు తెలుసని, పార్టీలో తప్పుడు చర్యలకు వ్యతిరేకంగా ఎవరు గొంతు పెంచినా ఢిల్లీ హైకమాండ్ వల్ల రాజకీయంగా నష్టపోతారని ప్రధాని ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ అధికారి, సైనికుడి వీరమరణం..
‘‘ రాజేష్ పైలట్ ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా మాట్లాడారని, అది కూడా కాంగ్రెస్ అభ్యున్నతి కోసమని, కానీ పార్టీ ఇప్పటి వరకు సచిన్ పైలట్‌ని శిక్షిస్తోందని, రాజేష్ పైలట్ ఇక లేరు, కానీ ఆయన కొడుకు సచిన్ పైలట్ పట్ల కాంగ్రెస్ ద్వేషం ప్రదర్శిస్తోంది’’ అని ప్రధాని మోడీ అన్నారు.
సోనియా గాంధీని ప్రధానిగా ప్రతిపాదించడంపై ఆ పార్టీ నాయకుల్లో ఒకరైన దివంగత రాజేష్ పైలట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 1996లో కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం సీతారాం కేసరిపై పోటీ చేసిన ఇద్దరు నేతల్లో రాజేష్ పైలట్ ఒకరు. ఈ ఎన్నికల్లో ఆయనతో పాటు శరద్ పవార్ కూడా ఓడిపోయారు.
రాజేష్ పైలట్ 2000లో మరణించారు. ఆయన కుమారుడు సచిన్ పైలట్ 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజస్థాన్‌లో 2018లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత పైలట్, సీఎం అశోక్ గెహ్లాట్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు సీఎం గెహ్లాట్ ప్రభుత్వాన్ని పతనం అంచుకు తీసుకువచ్చింది. అయితే అధిష్టానం ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య సయోధ్యను కుదర్చింది.