
Rajasthan Polling: రాజస్థాన్ నేడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. 68 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే ఈ ఒక్క గ్రామంలో మాత్రం ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. కనీసం పోలింగ్ బూతు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పోలింగ్ బూతు వెలవెలబోయింది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ ఎన్నికల నిర్వహకులు తప్ప ఒక్క ఓటరు కూడా కనిపించలేదు. జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థు ఎన్నికలను బహిష్కరించారు. ప్రజా ప్రతినిధులపై కోపంతోనే ఆ గ్రామస్తులు ఓటు హక్కును వినియోగించలేదని తెలుస్తోంది. ఇది మొదటి సారి కాదట.
ఏడు పర్యాయయాలుగా ఈ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. కారణం.. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రజాప్రతినిధులు వారి డిమాండ్‌ను నేరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఏడు పర్యాయాలుగా అక్కడ ఎన్నికలను బహిష్కరించారు.