
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి ప్రారంభమై 22 వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబరు 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. శీతాకాల సమావేశాలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. సాధారణంగా సెషన్ ప్రారంభానికి ఒక రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తారు. అయితే ఈసారి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 2వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల కానున్నాయి. అలాంటి పరిస్థితిలో ఈ ఫలితాలు పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక, ఈ సెషన్‌లో అనేక ముఖ్యమైన బిల్లులను ఆమోదించడానికి కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వస్తే మరింత బలం పుంజుకుంటుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. పార్లమెంటులో సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు.. మహువా మోయిత్రాపై ఎథిక్స్ కమిటీ నివేదిక కూడా ఈ సెషన్‌లో సమర్పించనున్నారు. నగదు, బహుమతుల కోసం పార్లమెంట్‌లో గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగారని మహువా మోయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి నివేదికను రెడీ చేసింది. ఇప్పుడు దీన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు.
అలాగే, పార్లమెంటులో ఈ నివేదికను ఆమోదించిన తర్వాత, మహువా మొయిత్రాను పార్లమెంటు నుండి బహిష్కరించడం ఖాయమవుతుంది. ఈ సెషన్‌లో ఇండియన్ జస్టిస్ కోడ్‌తో సహా మూడు ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లులు ఐపీసీ, సీఆర్పీసీతో పాటు ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకు ఇప్పటికే హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ లో ఆమోదం కోసం ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. వాస్తవానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్ మూడో వారంలో ప్రారంభమై క్రిస్మస్ పండుగకు ముందు ముగియనున్నాయి. కానీ, ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా మొదలవుతున్నది. ఎప్పటి లాగే క్రిస్మస్ పండుగకు ముందు ఈ సెషన్స్ ముగియనున్నాయి.