
PM Modi: వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్‌కు వెళ్లనున్న సందర్భంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పిలుపునిచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రేపు (డిసెంబరు 1) ప్రపంచ వాతావరణ సదస్సు జరగనుంది. 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP28) సదస్సులో భాగంగా జరుగుతున్న ఈ వాతావరణ కార్యాచరణ సమావేశానికి హాజరవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి దుబాయ్ పయనమయ్యారు. ఈ సదస్సుకు రావాలంటూ ప్రధాని మోదీని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ (అబుదాబి పాలకుడు) ఆహ్వానించారు.
దీనిపై మోదీ స్పందిస్తూ, యూఏఈ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుండడం సంతోషదాయకమని తెలిపారు. వాతావరణ పరిరక్షణ అంశంలో భారత్‌కు యూఏఈ ముఖ్యమైన భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన జీ20 సమావేశాల్లోనూ వాతావరణ కార్యాచరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని మోదీ వివరించారు. కాప్-28(COP28) అని పిలువబడే వాతావరణంపై ఐక్యరాజ్యసమితి ‘పార్టీల కాన్ఫరెన్స్’ సందర్భంగా శుక్రవారం ప్రపంచ వాతావరణ కార్యాచరణ సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మార్గాలను చర్చించడానికి అనేక మంది ప్రపంచ నాయకులు క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అనేది కాప్-28 యొక్క ఉన్నత-స్థాయి విభాగం.
మరో మూడు అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో కూడా ప్రధాని పాల్గొననున్నారు. కాప్-28 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు యూఏఈ అధ్యక్షతన జరుగుతోంది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం సాధించిన పురోగతిని సమీక్షించడానికి, వాతావరణ చర్యపై భవిష్యత్ కోర్సు కోసం మార్గాన్ని రూపొందించడానికి COP28 అవకాశాన్ని కల్పిస్తుందని పీఎం మోడీ తన ప్రకటనలో తెలిపారు. వాతావరణ చర్యల విషయంలో భారతదేశం ప్రధానంగా నడచిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్థ్యం, అడవుల పెంపకం, ఇంధన పొదుపు, మిషన్ లైఫ్ వంటి వివిధ రంగాల్లో మనం సాధించిన విజయాలు మాతృభూమి పట్ల మన ప్రజల నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. క్లైమేట్ ఫైనాన్స్, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్‌తో సహా ప్రత్యేక కార్యక్రమాలలో చేరడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు