Leading News Portal in Telugu

PNB Bank: బ్యాంక్‌లో భారీ చోరి.. సిబ్బంది ఉండగానే రూ. 18.8 కోట్ల నగదు లూటి


PNB Bank: బ్యాంక్‌లో భారీ చోరి.. సిబ్బంది ఉండగానే రూ. 18.8 కోట్ల నగదు లూటి

Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని బ్యాంక్లో భారీ చోరరీ జరిగింది. ఉఖ్రుల్‌ జిల్లాలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ నుంచి దుండగులు రూ. 18 కోట్ల నగదు దొంగలించ పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం తర్వాత బ్యాంక్ లావాదేవీలు, డిపాజిట్ కార్యకలాపాలను ముగించిన అనంతరం మెయిన్ షటర్‌ను మూసేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ సహా ఇతర సిబ్బంది లోపల పనిచేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు. ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న 10 మంది నేరుగా బ్యాంక్‌ దూరి.. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద విధుల్లో ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు.

అనంతరం బ్యాంకులో ఉన్న రూ.18.85 కోట్ల నగదును కాజేసి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృష్యాలు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఇందులో దుండగులు ఏకే రైఫిల్స్ సహా పలు ఆయుధాలతో లోపలికి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు మణిపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మే 3న జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్‌ రాష్ట్రంలో బ్యాంక్‌లో చోరి జరగడం ఇది మూడోసారి. దీంతో బ్యాంక్ ఖాతాదారులు, స్థానికులు ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.