Food poisoning: ఇటీవల కాలం పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. సంగ్రూర్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్యాంటీన్‌లో ఆహారం తిని 60 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని పోలీసులు శనివారం తెలిపారు. కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఫుడ్ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు.
క్యాంటీన్‌లోని ఆహారం తిన్న తర్వాత శుక్రవారం సాయంత్రం గబ్దాన్‌లోని ప్రభుత్వ మెరిటోరియస్ పాఠశాలలోని 20 మంది చిన్నారులు తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. వీరిని వెంటనే సంగ్రూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 15 మంది చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. శనివారం రోజు మరికొంత మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా 50 మంది చిన్నారులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు కలుషిత ఆహారం తిన్నారని, దీంతోనే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఆహార నమూనాలను పరీక్ష కోసం తరలించారు. ఈ ఘటనకు ముందు దీపావళి రోజున హాస్టల్‌లో వడ్డించే ఆహారంలో పురుగులు వచ్చాయని, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు చెప్పారు.