Leading News Portal in Telugu

Assembly election results 2023: 4 రాష్ట్రాల్లో సీఎంలు అయ్యే అవకాశం వీరికే ఉంది..


Assembly election results 2023: 4 రాష్ట్రాల్లో సీఎంలు అయ్యే అవకాశం వీరికే ఉంది..

Assembly election results 2023: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. ఈ రోజు ఛత్తీస్‌‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందితే.. మిగిలిన మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో సీఎంలుగా ఎవరుంటారనే చర్చ జరుగుతోంది. పాతవాళ్లనే కొనసాగిస్తారా..? లేక కొత్త ముఖాలు అధికారాన్ని చేపడుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ:

తెలంగాణలో చూస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా రేసులో ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

మధ్యప్రదేశ్:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2006 నుంచి బీజేపీ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుగులేని నేతగా ఉన్నారు. అవినీతి లేకపోవడం ఆయనకు క్లీన్ ఇమేజ్ ఇస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన నేతృత్వంలోనే బీజేపీ గెలుపొందింది. 2006 నుంచి ఆయన బుధ్నీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ గెలుపొందుతున్నారు.

రాజస్థాన్:

రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజేకి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి రేసులో ఈమె ముందు ఉంది.

ఇక రాజస్థాన్ ఎన్నికల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బాబా మహంత్ బాలక్ నాథ్. అందరి కన్నా ముందు సీఎం రేసులో ఉన్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాగే బాలక్ నాథ్ ఓ యోగి. ఆయన ప్రస్తుతం అల్వార్ నుంచి ఎంపీగా ఉన్నారు. బాలక్ నాథ్ తిజారా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ విజయం సాధించారు. అవినీతి, మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలు కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి.

ఛత్తీస్‌గఢ్:

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కే బీజేపీ తరుపున సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన మూడు సార్లు రాష్ట్రానికి సీఎంగా కొనసాగారు.