Leading News Portal in Telugu

Congress Meeting: మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి.. నేతలతో సోనియా గాంధీ సమావేశం


Congress Meeting: మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి.. నేతలతో సోనియా గాంధీ సమావేశం

తెలంగాణ మినహాయిస్తే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో సోనియా గాంధీ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. జనపథ్ నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో మూడు రాష్ట్రాల్లో పేలవమైన పనితీరుపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. పార్లమెంట్‌లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చ, తెలంగాణలో సీఎంను ఎంపిక చేసే అంశంపై చర్చించే అవకాశముంది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ గౌరవ్ గొగోయ్, నాసిర్ హుస్సేన్, మాణికం ఠాగూర్, ప్రమోద్ తివారీ, అభిషేక్ మను సింఘ్వీ, ఎంపీ మనీష్ తివారీ, పీ చిదంబరం, రజనీ పాటిల్, కేసీ వేణుగోపాల్, ఎంపీ శశిథరూర్, రవనీతి బిట్టు, జైరాం రమేశ్, రణదీప్ సూర్జేవాలా పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే.. ఈసారి కూడా.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమి చెందగా.. ఇంతకుముందు కాంగ్రెస్ కు కంచుకోటలా ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటుకాలేకపోయింది. ఈ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ ఇంట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో సోనియాగాంధీ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలు అప్పగించిన నేతలతో మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా.. ఇండియా కూటమి సమావేశం గురించి చర్చించే అవకాశముంది. కాగా.. డిసెంబర్ 6వ తేదీన కాంగ్రెస్ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.