Leading News Portal in Telugu

Amit Shah: “కాశ్మీర్ సమస్యకు నెహ్రూ తప్పిదాలే కారణం”.. పార్లమెంట్‌లో అమిత్ షా..


Amit Shah: “కాశ్మీర్ సమస్యకు నెహ్రూ తప్పిదాలే కారణం”.. పార్లమెంట్‌లో అమిత్ షా..

Amit Shah: లోక్‌సభలో కాశ్మీర్ సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్ల్-2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జమ్మూకాశ్మీర్ సమస్యకు భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని మరోసారి నిందించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు మాజీ ప్రధాని బాధ్యత వహించాలని అమిత్ షా అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ మూలంగానే పీఓకే సమస్య ఏర్పడిందని లేకపోతే అది భారతదేశంలో భూభాగం ఉండేదని ఆయన చెప్పారు.

ఇది తన తప్పే అని నెహ్రూ కూడా చెప్పారని అమిత్ షా గుర్తు చేశారు. ఒక్క తప్పిదం వల్ల ఈ దేశం చాలా భూమిని కోల్పోయిందని అన్నారు. నెహ్రూ చేసిన రెండు తప్పుల కారణంగా జమ్మూ కాశ్మీర్ నష్టపోయింది. ఆనాడు యుద్ధ సమయంలో కాల్పుల విరమణ ప్రకటించడం, కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితిలో పెట్టడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023 & జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2023పై చర్చ సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు.

నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. మూడు రోజులు కాల్పుల విరమణ జరగకుండా ఉంటే, మన అంతర్గత విషయాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్ల కుండా ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేదని అమిత్ షా కాశ్మీర్ గురించి చెప్పారు.