
Shah Rukh Khan: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలతో 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. అయితే, ఈ కేసులో భారత్ దౌత్యపరంగా ఖతార్‌పై ఒత్తిడి తీసుకురావడంతో 8 మందిని ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడుదలతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సాయం చేశారని, వారి విడుదలకు ఖతార్ ప్రభుత్వాన్ని ఒప్పించారని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. ‘‘ఖతార్‌లో షేక్‌లను భారత విదేశాంగా శాఖ, ఎన్ఎస్ఏ ఒప్పించడంలో విఫలం కావడంతో, ప్రధాని మోడీ, షారూఖ్ ఖాన్ జోక్యాన్ని కోరారు, దీంతో మాజీ నేవీ అధికారులు విడుదలయ్యారు. మోడీ తనతో పాటు షారూఖ్ ఖాన్‌ని ఖతార్ తీసుకెళ్లాలి’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అయితే, సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలపై షారూఖ్ ఖాన్ కార్యాలయం స్పందించింది. ‘‘ ఖతార్ నుంచి భారత నేవీ అధికారులను విడుదల చేయడంతో షారూఖ్ ఖాన్ పాత్రకు సంబంధించి ఎలాంటి ప్రమేయం లేదని, ఇవన్నీ నిరాధారమైనవి’’ అని షారూఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్నానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దౌత్యం, రాజ్యాధికారానికి సంబంధించిన విషయాలను సమర్థులైన నాయకులు ఉత్తమంగా అమలు చేస్తారని, నావికాదళ అధికారులు ఇంటికి సురక్షితంగా చేరడంతో మిస్టర్ ఖాన్ కూడా చాలా మంది భారతీయుల వలే సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పారు.
ఏఎఫ్‌సీ ఫైనల్‌కి ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు షారూఖ్ ఖాన్ ఇటీవల ఖతార్ వెళ్లారు. ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీని కలుసుకున్నారు. ఈ పరిణామం తర్వాత సోమవారం తెల్లవారుజామున 8 మంది భారతీయులను విడుదల చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆగస్ట్ 2022లో గూఢచర్యం ఆరోపణలపై గల్ఫ్ దేశంలో 8 మంది నిర్బంధించబడ్డారు. జలాంతర్గామిపై ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేశారని వారికి మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు.