Leading News Portal in Telugu

Odisha: చనిపోయిందనుకున్నారు.. చితి పేర్చే సమయంలో కళ్లు తెరిచిన మహిళ..


Odisha: చనిపోయిందనుకున్నారు.. చితి పేర్చే సమయంలో కళ్లు తెరిచిన మహిళ..

Odisha: చనిపోయిందని భావించి, అంత్యక్రియలకు సిద్ధమైన తరుణంలో మళ్లీ ప్రాణాలు పోసుకున్న ఘటనలు ఇది వరకు చాలానే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ 52 ఏళ్ల మహిళను కాసేపైతే చితిపైకి తీసుకెళ్తారనే సమయంలో కళ్లు తెరవడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ పట్టణంలో ఈ సంఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు.


నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ ఫిబ్రవరి 1న ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 50 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు వేరే ఆస్పత్రికి రిఫర్ చేవారు. అయితే, డబ్బులు లేకపోవడంతో మహిళ భర్త సిబారామ్ పాలో ఇంటికి తీసుకెళ్లాడు. సోమవారం ఆమె కళ్ల తెరవకపోవడం, శ్వాసతీసుకోకపోవడంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబీకులు దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధమయ్యారు. బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బిజీపూర్‌లోని శ్మశాన వాటికకు తరలించారు. కాసేపైతే చితిమీదకు తీసుకెళ్తారనే సమయానికి ఒక్కసారిగా మహిళ కళ్లు తెరవడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లి మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు.