Leading News Portal in Telugu

Scholarship: కొత్త స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రకటించిన ఒడిశా సర్కార్


Scholarship: కొత్త స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రకటించిన ఒడిశా సర్కార్

త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న అధికార-ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం (Odisha Government) కూడా సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.


డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్‌ పథకం (New Scholarship Scheme) అమలు చేయాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద అబ్బాయిలకు ఏడాదికి రూ.9 వేలు, విద్యార్థినులకు రూ.10వేలు చొప్పున అందించనున్నారు.

ఎస్సీ/ఎస్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులైతే రూ.10 వేలు, విద్యార్థినులైతే రూ.11వేలు చొప్పున అందించనున్నారు. ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

నూతన ఉన్నత అభిలాష-ఒడిశా పేరిట అమలు చేసే ఈ పథకం ద్వారా యువతకు నిరంతరం నైపుణ్యాలు కల్పించి కొత్త అవకాశాలతో సాధికారత సాధించేందుకు కృషిచేయడమే లక్ష్యమన్నారు. 2023-24 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.385 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం 30 జిల్లాల్లో అమలు చేయనున్నారు. గిరిజన, మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఆదాయపు పన్ను చెల్లించడం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులైతే వారు స్కాలర్‌షిప్‌కు అనర్హులని వెల్లడించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్ నగదును ఫిబ్రవరి 20 నుంచి అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4.5లక్షల మంది డిగ్రీ విద్యార్థులు, 32వేల మంది పీజీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.