
rajya sabha elections: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, 1998 నుంచి 2022 మధ్య దాదాపు 22 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎంపికయ్యారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇరువురు సోనియాగాంధీతో జైపూర్ కు వెళ్లే అవకాశం ఉంది. సోనియా గాంధీకి కొన్ని ఇతర రాష్ట్రాల వారు నామినేషన్ దాఖలు చేయమని కోరారు కానీ.. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే, రాజస్థాన్ నుంచి చివరిసారిగా రాజ్యసభకు ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయబోతున్నారు. సోనియా గాంధీ రాజస్థాన్‌ను ఎంపిక చేసుకోవడానికి.. తెలంగాణ లాంటి రాష్ట్రాలను ఎంచుకోకపోవడానికి పార్టీ నాయకత్వం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో పాటు రాహుల్ గాంధీ సైతం కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానం కోసం నేడు నామినేషన్ దాఖలు చేయనుంది.
ఇక, సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కంచుకోటగా ఉంది. 2004 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు సోనియా గాంధీ వరుసగా రాయ్‌బరేలీలో విజయం సాధించారు. కాగా, 56 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం గత నెలలో వెల్లడించింది. 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ల దాఖలుకు రేపే చివరి రోజు.. ఇక, ఫిబ్రవరి 27న ఓటింగ్ జరగనుంది.