Leading News Portal in Telugu

California: కాలిఫోర్నియాలో పిల్లలతో సహా భారతీయ కుటుంబం మృతి.. హత్య-ఆత్మహత్యగా పోలీసుల అనునమానం


California: కాలిఫోర్నియాలో పిల్లలతో సహా భారతీయ కుటుంబం మృతి.. హత్య-ఆత్మహత్యగా పోలీసుల అనునమానం

California: అమెరికా కాలిఫోర్నియాలో దారుణం చోటు చేసుకుంది. భారతీయ దంపతులు, తమ ఇద్దరు పిల్లలతో కలిసి మరణించారు. 2 మిలియన్ డాలర్ల విలువైన ఇంటిలో విగతజీవులుగా కనిపించారు. మరణించిన వ్యక్తుల్ని ఆనంద్ సుజిత్ హెన్రీ, 42, అతని భార్య అలిస్ ప్రియాంక, 40, మరియు వారి 4 సంవత్సరాల కవల పిల్లలు నోహ్ మరియు నీతాన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనను హత్య-ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన వ్యక్తులపై తుపాకీ గాయాలు కనిపించాయి.


ఇంట్లో ఎవరూ ఫోన్ తీయకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారతీయ-అమెరికన్ జంట ఆనంద్, ఆలిస్ బాత్రూమ్‌లో తుపాకీ గాయాలతో చనిపోయారు. కవల పిల్లలు బెడ్‌రూమ్‌లో మరణించి ఉన్నట్లు గుర్తించారు. వారి మరణానికి ఇంకా స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. ఇంట్లోకి ఎవరూ కూడా బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు కనిపించలేదని, తాము కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత నలుగురు మరణించి ఉన్నట్లు కనుగొన్నామని పోలీసులు వెల్లడించారు. బాత్‌రూమ్‌లో 9 ఎంఎం పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ జంట 2020లో 2.1 మిలియన్ డాలర్లతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. కేరళకు చెందిన ఈ కుటుంబం గత 9 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఆనంద్, సీనియర్ అనలిస్ట్ అయిన ఆలిస్ రెండేళ్ల క్రితం న్యూజెర్సీ నుంచి శాన్ మాటియో కౌంటీకి మకాం మార్చారు. 2016 డిసెంబర్‌లో ఆనంద్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టు రికార్డులు సూచిస్తున్నాయి, అయితే విచారణ పూర్తి కాలేదు.