
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరోసారి పాకిస్తాన్ రేంజర్లు బరితెగించారు. సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై కాల్పలు జరిపారు. ఈ రోజు సాయంత్రం పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని అధికారులు తెలిపారు. మక్వాల్ లోని సరిహద్దు ఔట్‌పోస్టు వెంబడి బీఎస్ఎఫ్ సిబ్బంది, సరిహద్దు అవతలి వైపు నుంచి వస్తున్న కాల్పులను తిప్పికొట్టారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన కాల్పులు 20 నిమిషాలకు పైగా కొనసాగినట్లు అధికారులు తెలిపారు. భారత్ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరలేదని వెల్లడించారు.
గతేడాది నవంబర్ 8-9 మధ్య రాత్రిలో సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో ఇలాగే పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. 2021 ఫిబ్రవరి 25న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగకరించాయి. ఈ ఒప్పందం కుదరిన తర్వాత తొలి మరణం నమోదైంది. అంతకుముందు అక్టోబర్ 26న, జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో సరిహద్దు కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరియు ఒక మహిళ గాయపడగా, అక్టోబర్ 17న జరిగిన ఇలాంటి ఘటనలో మరో బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డాడు. సాధారణంగా పాక్ నుంచి ఉగ్రవాదుల్ని కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ రేంజర్లు కాల్పులతో భారత బలగాల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుంటారు.