Leading News Portal in Telugu

Farmers Protest: కేంద్రంతో చర్చలకు రైతుల రెడీ.. ఎప్పుడంటే..!


Farmers Protest: కేంద్రంతో చర్చలకు రైతుల రెడీ.. ఎప్పుడంటే..!

తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అన్నదాతలు (Farmers Protest) చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం మరింత ఉధృతంగా మారుతోంది. ఇప్పటికే దేశ రాజధాని పరిసరాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు కర్షకులు హస్తినకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇప్పటికే ఆయా రహదారులను భద్రతా దళాలు అష్టదిగ్బంధం చేశాయి. అయినా వాటిని ఛేదించుకుని రైతులు ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు టియర్ గ్యాస్, జల ఫిరంగులు ఉపయోగిస్తున్నారు.


ఇదిలా ఉంటే రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని.. వారి ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదని కోరారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్రంతో చర్చించేందుకు రైతులు సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటలకు కేంద్రంతో సమావేశం జరగనుందని పంజాబ్‌లోని రాజ్‌పురా బైపాస్‌లో పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. రైతులపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ (PM Modi) పెద్ద మనసుతో ఎమ్‌ఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలని కోరారు.