Leading News Portal in Telugu

Electoral Bonds: నేడు ఎలక్టోరల్ బాండ్ల అమ్మకంపై సుప్రీం కోర్టు తుది తీర్పు..


Electoral Bonds: నేడు ఎలక్టోరల్ బాండ్ల అమ్మకంపై సుప్రీం కోర్టు తుది తీర్పు..

Supreme Court: రాజకీయ పార్టీలకు డబ్బు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం గతేడాది నవంబర్ 2న తీర్పును రిజర్వ్ చేసింది. అదే సమయంలో సీల్డ్‌ కవర్‌లో 2023 సెప్టెంబర్‌ 30 వరకు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సైతం ఆదేశించింది. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ చేయాలని సీనియర్‌ లాయర్ ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈ పిటిషన్లపై మూడు రోజుల పాటు విచారణ చేసిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్‌ 2వ తేదీన తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు చెప్పింది. ఈ కానిస్టిట్యూషన్‌ బెంచ్‌లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలు సభ్యులుగా ఉన్నారు.


అయితే, ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్‌ లాంటివి.. ఇవి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో లభిస్తాయి. భారతదేశానికి చెందిన వ్యక్తులు లేదా కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు.. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు అన్నమాట. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటారు. కాగా, కేంద్రం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక చట్టం-2017లో సవరణలు చేసింది. దీంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

కాగా, ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని తెలిపింది. గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోంది అని చెప్పుకొచ్చింది. అలాగే, ఎస్‌బీఐ దగ్గర ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి.. ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు.. అదే విపక్షంలో ఉన్న వారికి అలాంటి దానికి అవకాశం ఉండదన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుంది అని రాజ్యంగ ధర్మాసనం పేర్కొనింది.

ఇక, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.5,127.97 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిసి కేవలం రూ.1,783.93 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. దీంతో ఎలక్టోరల్‌ బాండ్లతో అధికార పార్టీకి ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చని విపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.