Leading News Portal in Telugu

Uttarakhand: ఉత్తరాఖండ్‌కు మూడు విమానాశ్రయాలు, 21 హెలీప్యాడ్‌లు..!


Uttarakhand: ఉత్తరాఖండ్‌కు మూడు విమానాశ్రయాలు, 21 హెలీప్యాడ్‌లు..!

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో డెహ్రాడూన్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ, మొదటి దశ కింద హెలిపోర్టుల నిర్వహణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. రెండో దశలో విమానాశ్రయాలు, హెలిపోర్టుల పనులు త్వరలో పూర్తి కాబోతున్నాయి. అయితే, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల ఏకైక జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్టు నుంచి 2024లో రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.


కాగా, గతంలో డెహ్రాడూన్ ఎయిర్ పోర్టుకు దేశంలోని మూడు నగరాలతో మాత్రమే కనెక్టివిటీ ఉంది. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగిపోయింది. ప్రస్తుతం డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ దేశంలోని 13 నగరాలకు పెరిగింది. 2014 వరకు ఈ విమానాశ్రయం నుంచి 40 విమానాలు మాత్రమే సర్వీసులు నడిచేవి. 2024 చివరి నాటికి ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య 200 వరకు పెరిగే అవకావం ఉంది.

అయితే, గత పదేళ్లలో డెహ్రాడూన్ విమానాశ్రయ కార్యకలాపాల్లో దాదాపు 130 శాతం పెరుగుదల కనిపిస్తుంది. త్వరలో ఉత్తరాఖండ్‌లో కొత్త హెలిపోర్ట్‌లతో పాటు నూతన విమానాశ్రయాలు రాబోతున్నాయి. డెహ్రాడూన్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్, పితోర్‌గఢ్‌లలో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు విమానయాన మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో ఏడు హెలిపోర్ట్‌లు స్టార్ట్ అయ్యాయి. వీటిలో అల్మోరా, చిన్యాలిసౌర్, గౌచర్, సహస్త్రధార, న్యూ తెహ్రీ, శ్రీనగర్, హల్ద్వానీ మొదలైనవి ఉన్నాయి. ధార్చుల, హరిద్వార్, జోషిమా, ముస్సోరీ, నైనిటాల్, రామ్‌నగర్‌లో కొత్త హెలిపోర్ట్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఇక, ఉత్తరాఖండ్‌లో ఒక విమానాశ్రయం, ఏడు హెలిపోర్టులను ఏ‍ర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. బాగేశ్వర్, చంపావత్, లాన్స్‌డౌన్, మున్సియరి, త్రియుగినారాయణ్‌లలో ఐదు కొత్త హెలిపోర్ట్‌లను ఆరంభించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఉత్తరాఖండ్‌లో విమానాశ్రయాల సంఖ్య మూడుకు, హెలిపోర్టుల సంఖ్య 21కి చేరబోతుంది.