
NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పార్టీ వివాదంలో మరోసారి శరద్ పవార్‌కి షాక్ తగిలింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని మహారాష్ట్ర స్పీకర్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేది లేదని స్పీకర్ రాహుల్ నార్వేకర్ తేల్చి చెప్పాడు. అజిత్ పవార్ వర్గానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉందని ఆయన చెప్పారు.
‘‘ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైందని, అజిత్ పవార్‌కి 41 మంది ఎమ్మెల్యేల మద్దతుతో శాసన సభలో మెజారిటీ ఉందని, దీంట్లో వివాదం ఏమీ లేదు’’ అని స్పీకర్ నార్వేకర్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో శరద్, అజిత్ పవార్లకు కలిపి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని చెప్పింది.
2023లో ఎన్సీపీలో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. ప్రస్తుతం బీజేపీ-శివసేన(ఏక్‌నాథ్ షిండే)- ఎన్సీపీ(అజిత్ పవార్) కలిసి ప్రభుత్వంలో ఉన్నారు.