
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంతా సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలన్నింటికి కలిపి 3.40 లక్షల మంది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్(సీఎపీఎఫ్) బలగాలను మోహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 3400 కంపెనీలు(3.40 లక్షల సిబ్బంది) పారామిలిటరీ విభాగాలను మోహరించాలని కోరుతూ ఎన్నికల సంఘం పంపిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీఏపీఎఫ్‌ని మోహరించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా చూసేందుకు కసరత్తు జరుగుతోంది.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కోసం గరిష్టంగా 920 CAPF కంపెనీలను కోరింది, జమ్మూ మరియు కాశ్మీర్‌లో 635 కంపెనీలు కావాలని ఈసీ కోరింది. ఛత్తీస్‌గఢ్ లో 360, బీహార్‌కి 295, యూపీకి 252 కంపెనీల బలగాలను కోరగా.. ఏపీ, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఒక్కొక్కటికి 250 కంపెనీలు, గుజరాత్, మణిపూర్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కటికి 200 కంపెనీలు, ఒడిశాకు 175, అస్సాం, తెలంగానలకు 160 కంపెనీల చొప్పున, మహారాష్ట్రలో 150; మధ్యప్రదేశ్‌లో 113; త్రిపురలో 100; హర్యానాలో 95; అరుణాచల్ ప్రదేశ్‌లో 75; కర్ణాటక, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీలో ఒక్కొక్కరు 70; కేరళలో 66; లద్దాఖ్‌లో 57; హిమాచల్ ప్రదేశ్‌లో 55; నాగాలాండ్‌లో 48; మేఘాలయలో 45; సిక్కింలో 17; మిజోరంలో 15; దాద్రా మరియు నగర్ హవేలీలో 14; గోవాలో 12; చండీగఢ్‌లో 11; పుదుచ్చేరిలో 10; అండమాన్ మరియు నికోబార్‌లో ఐదు, లక్షద్వీప్‌కి మూడు కంపెనీలు కావాలని ఎన్నికల సంఘం కోరింది. లోక్‌సభలోని 543 స్థానాలకు ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్నాయి.