Leading News Portal in Telugu

PM Modi: మాజీ నేవీ అధికారుల ఉరిశిక్ష రద్దు తర్వాత ఖతార్ ఎమిర్‌తో పీఎం మోడీ చర్చలు..


PM Modi: మాజీ నేవీ అధికారుల ఉరిశిక్ష రద్దు తర్వాత ఖతార్ ఎమిర్‌తో పీఎం మోడీ చర్చలు..

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన ఖతార్ వెళ్లారు. ఇటీవల ఖతార్‌లో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే, భారత్ దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకురావడంతో ఖతార్ దిగివచ్చి వారందర్ని విడుదల చేసింది. ప్రస్తుతం వీరంతా ఇండియా చేరుకున్నారు.


ఇదిలా ఉంటే, ఈ పరిణామం జరిగిన కొన్ని రోజులకే, ఈ రోజు ప్రధాని మోడీ, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో గురువారం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. దోహాలో భేటీ అయిన ఇరువురు దేశాధినేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ఖతార్ దేశాన్ని ప్రధాని రెండోసారి సందర్శించారు. అంతకుముందు 2016లో ఆ దేశంలో పర్యటించారు. ముఖ్యంగా సీఎన్జీ, చమురు రంగాల్లో ఇరు దేశాల నేతలు చర్చించినట్లు సమాచారం.

ఈ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో పలు ఒప్పందాలు చేసుకున్నారు. అబుదాబిలో నిర్మితమైన, గల్ఫ్ లోనే అతిపెద్దదైన హిందూ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు.