Leading News Portal in Telugu

Farmers Protest 2024: రైతుల నిరసనలు.. నొయిడాలో 144 సెక్షన్!


Farmers Protest 2024: రైతుల నిరసనలు.. నొయిడాలో 144 సెక్షన్!

Section 144 imposed in Noida: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం చేపట్టిన రైతు సంఘాల ఆందోళనలు శుక్రవారం (ఫిబ్రవరి 16) నాలుగో రోజుకు చేరాయి. ఢిల్లీ చలో ఆందోళనకు మద్దతుగా శుక్రవారం గ్రామీణ భారత్‌ బంద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు పలు పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. గ్రామీణ భారత్‌ బంద్‌ నేపథ్యంలో నొయిడాలో 144 సెక్షన్‌ విధించారు. నోయిడా పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) కింద గురువారం అర్థరాత్రి సెక్షన్ 144 విధించారు.


గ్రేటర్ నోయిడా, గౌతమ్ బుద్ధ నగర్ నుంచి ఢిల్లీకి ఆనుకుని ఉన్న అన్ని సరిహద్దులలో ఢిల్లీ పోలీసులు, గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ఇంటెన్సివ్ చెకింగ్ చేస్తారని అధికారులు తెలిపారు. చెకింగ్ కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందని, కొన్నిచోట్ల ట్రాఫిక్ మళ్లించబడుతుందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లే ప్రజలు వీలైనంత వరకు మెట్రోను ఉపయోగించాలని పోలీసులు కోరారు. నొయిడా, గ్రేటర్ నొయిడా, సిర్సా, పారి చౌక్, సూరజ్‌పూర్‌ వాహనదారులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు.